Wednesday, July 30, 2008

సవతి తల్లి

తల్లి చనిపోతే తండ్రి సుందరయ్యే కమలని తల్లిలా పెంచుకొచ్చాడు. సంగీతం నేర్చుకుంటానంటే ఆ పిల్లని పక్క వీధి కాంతం దగ్గర పెట్టాడు. సుందర య్యను పెళ్ళి చేసుకోవాలని కాంతానికి ఎప్పటి నుంచో కోరికగా ఉంది. ఆ సంగతి కమలకి చెప్పి-"మీ నాన్న నన్ను పెళ్ళి చేసుకుంటాడేమో అడిగి చూడరాదూ? అప్పుడు ఎంచక్కా నేను మీ ఇంట్లోనే నీకు సంగీతం నేర్పుతాను'' అంది. "అడిగి చూస్తానయితే'' అంది కమల. అన్నట్టుగానే తండ్రిని అడిగింది.కాంతానికి ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. ఓ చెల్లెలు కుంటిది. ఇంకో చెల్లెలు గుడ్డిది. మూడో చెల్లెలు మూగది. ఈ ముగ్గురు చెల్లెళ్ళనీ పెట్టుకుని, సంగీతాన్ని పదిమందికీ నేర్పుతూ కాలాన్ని వెళ్ళదీస్తోంది కాంతం. తిండికి, గుడ్డకీ ఆ నలుగురికీ చాలా కష్టంగా ఉంటోంది. ఆ కష్టాలు పోవాలంటే అంతో ఇంతో ఆస్తి పరుడు సుందరయ్యను పెళ్ళి చేసుకోవడమే దిక్కు అనుకుంది కాంతం. అందుకే కమలను పురిగొల్పింది."కాంతాన్ని పెళ్ళి చేసుకుంటానమ్మా! కాకపోతే ఇదిగో! నా తలపాగా ఉంది చూశావు! ఈ తలపాగా చిరిగి పీలికలయితే...అప్పుడు...అప్పుడు పెళ్ళి చేసుకుంటాను'' అన్నాడు సుందరయ్య. ఆ రకంగా పెళ్ళిని వాయిదా వేశాడు. తండ్రి చెప్పిన సమాధానం మర్నాడు కాంతానికి చెప్పింది కమల. "ఇప్పుడు ఆ తలపాగా ఎక్కడ ఉంది'' కమలని అడిగింది కాంతం."మా ఇంట్లోనే ఉంది'' చెప్పింది కమల. "అయితే దాన్ని తీసుకుని రా! చింపి పీలికలు చేద్దాం'' అంది కాంతం. 'సరే'నంటూ వెళ్ళి తండ్రి తలపాగాను తీసుకుని వచ్చింది కమల. తలపాగాను కత్తెరతో కత్తిరించి, తర్వాత చించి పీలికలు చేసింది కాంతం.
పీలికలయిన తలపాగాను తండ్రికి చూపించి-"ఇదిగో నాన్నా! నీ తలపాగా పీలికలైంది! కాంతం పిన్నిని పెళ్ళి చేసుకో! పద'' అంది కమల."అప్పుడలా అన్నాను కాని, అసలు సంగతి ఇప్పుడు చెబుతున్నానమ్మా! అదిగో అక్కడ నా కాలి చెప్పులు ఉన్నాయి కదా! ఆ చెప్పులు ఎప్పుడు అరిగి ముక్కలవుతాయో అప్పుడు కాంతాన్ని పెళ్ళి చేసుకుంటాను''
అన్నాడు సుందరయ్య. ఆ మాట కూడా కాంతానికి చెప్పింది కమల. "అయితే వెళ్ళి ఆ చెప్పులు తీసుకుని రా! చెప్తాను'' అంది కాంతం. తీసుకొచ్చి ఇస్తే ఆ చెప్పుల్ని ముగ్గురు చెలె ్లళ్ళ చేతా ముందు అరగదీయించి, తర్వాత వాటిని కత్తెరతో ముక్కలు చేసింది కాంతం."తీసుకుని వెళ్ళి మీ నాన్నకి ఈ చెప్పుల్ని చూపించు! ఏమంటాడో చూడు'' అంది. 'అలాగే'అని చెప్పుల్ని తీసుకుని వె ళ్ళి తండ్రికి చూపించింది కమల. "చూశావా! చెప్పులు అరిగి ముక్కలై పోయాయి. పద! కాంతం పిన్నిని పెళ్ళి చేసుకుందూగాని'' అంది. ఇక తప్పదనుకుని కాంతాన్ని పెళ్ళి చేసుకున్నాడు సుందరయ్య. అలా తన ముగ్గురు చెల్లెళ్ళతో పాటు కాంతం, సుందర య్య ఇంటిలో తిష్ట వేసింది. పెళ్ళి అయిన కొత్తలో...కొద్ది రోజులు బాగానే గడిచాయి. కమలని కంటికి రెప్పలా కాపాడింది కాంతం. తర్వాతే అసలు కథ ప్రారంభమయింది. కమలంటే ఒకప్పుడు ఎంతగానో అభిమాన పడిన కాంతానికి ఇప్పుడు కమలంటే అసహ్యం! చిరాకు! ఆ పిల్ల 'పిన్ని' అని పిలిస్తే చాలు! కాంతానికి ఒంటి మీద తేళ్ళు, జెర్రెలూ పాకుతున్నట్టుగా ఉంది. సంగీత సాధనా లేదు, చట్టుబండలూ లేదు! కాంతం ఇంట అడుగు పెట్టిన దగ్గర్నుంచి కమలకి పనే పని! పనితో పాటు కడుపు నిండా తిండి కూడా ఆ పిల్లకు లేదు. కాంతం ముగ్గురు చెల్లెళ్ళు మాత్రం ముప్పూటలా తెగ తింటున్నారు. తిన్నది అరగడానికి ఆడుకుంటూ ఆటకి
కమలని పిలిస్తే, పనిలో ఉండి ఆ పిల్ల రాలేనంటే కోపంతో ఆమెను కొడుతున్నారు కూడా. ఇదంతా గమనించిన సుందర య్య ఓ రోజు...సరదాగా తీర్థానికి వెళ్ళి వద్దామంటూ కమలను బయల్దేరదీశాడు. ఓణీలో ఇన్ని వేరు
సెనగ కాయలు పోసి, తింటూ తన వెంటే నడవమని చెబితే 'అలాగే' అంటూ సుందరయ్యను అనుసరించింది కమల. వేరు సెనగ కాయలు తింటూ తొక్కలు కింద పడేస్తూ తండ్రితో పాటుగా చాలా దూరం నడిచింది. ఇద్దరూ రాజుగారి
కోట దాటారు. ఊరు దాటారు. దాటి దాటి అదిగదిగో అడవి అంటే ఇదిగిదిగో అమ్మ వారి కోవెల అన్నట్టుగా ఆ కోవెల దగ్గరకి వచ్చారు. ఏనాటి కోవెలో అది! బాగా పాతబడి పాడుబడి ఉంది. కోవెలలో అమ్మ వారి విగ్రహం
అయితే ఉందిగాని, ఆ విగ్రహం బూజు పట్టి ఉంది. గర్భగుడి తలుపులకి చిన్ని చిన్ని గంటలు ఉన్నాయి. అడవి గాలికి ఆ గంటలు ఊగి గోల చేస్తున్నాయి. "తీర్థం అన్నావ్‌! ఇక్కడీ కోవెలకు తీసుకొచ్చేవే నాన్నా'' తండ్రిని అడిగింది కమల. "తీర్థం ఇంకా బాగా దూరంలో ఉందమ్మా! వెళ్దాం! దాహంగా ఉంది. అడవిలో నీరు దొరుకుతుందేమో చూసి వస్తాను. అందాకా నువ్విక్కడ కూర్చో''అన్నాడు సుందరయ్య. "నేనూ నీతో పాటు వస్తాను నాన్నా''"వద్దమ్మా! నువ్వు ఇక్కడ కూర్చో! నేను వెళ్ళి ఇట్టే వస్తానుగా'' అన్నాడు సుందరయ్య. కమలని ఒంటరిగా అక్కడ కూర్చోబెట్టి-"భయపడకు! నాకేం కాదమ్మా! గర్భగుడి తలుపులకి ఆ చిన్ని గంటలు ఉన్నాయి చూడు! ఆ గంటలు కొట్టుకుంటూ శబ్దం చేస్తున్నంత కాలం అడవిలో నాకేం కానట్టే! అవి శబ్దం చెయ్యలేదంటే నేను ప్రమాదంలో పడ్డట్టని తెలుసుకో'' అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు సుందరయ్య. తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది కమల. మధ్యాహ్నం అయింది. గోధూళి వేళయింది. సూర్యుడు అస్తమించాడు. సాయంత్రం అయింది. . అయినా అడవిలోకి వెళ్ళిన నాన్న తిరిగి రాకపోవడంతో కంగారు పడింది కమల. కోవెల గంటలు కొట్టుకుని శబ్దం చేస్తున్నా కమలకి అందోళనగానే ఉంది. అడవిలో నాన్న ఏమయ్యాడోనని భయం పట్టుకుందా పిల్లకు. ఏడ్చింది. ఏడ్చేడ్చి... ఆ ఏడుపులోనే అడవి గాలికి గంటలు కొట్టుకుంటున్నాయన్న నిజాన్ని తెలుసుకుని, క్రూర జంతువుల అరుపులు వినవస్తోంటే, చీకటి పడుతోంటే ఇంకా అక్కడ ఉండడం ప్రాణానికే ప్రమాదం అనుకుని అక్కణ్ణుంచి పరుగు పరుగున బయల్దేరింది. ఊరిలోకి వచ్చేందుకు తను ఇందాక తిని పారేసిన వేరు సెనగ కాయల తొక్కులను ఆధారం చేసుకుని వాటిని అనుసరించసాగింది. కొద్ది దూరం వరకు తొక్కులు కనిపించాయి. తర్వాత కనిపించలేదు. ఇంతలో చీకటి చిక్కగా అలుముకుంది. దారి కానరాక, దిక్కు తెన్నూ తెలియక గగ్గోలుగా ఏడుస్తోన్న కమలని చూసి, అడవి దగ్గరి ఆలయంలోని అమ్మవారు జాలిపడి, నిండు ముత్తయిదువుగా దర్శనమిచ్చి-"ఎందుకమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు'' అడిగింది. జరిగిందంతా చెప్పుకొచ్చింది కమల. "మీ నాన్నకే కాలేదుకాని, రా! నాతో మా ఇంట్లో ఉందూగాని'' అని ఊరిలోనికి తీసుకుని వెళ్ళి ఓ అందమైన భవంతిలో కమలని ఉంచి, మర్నాడు ఆ పిల్ల చేతికి ఓ గులాబీని ఇచ్చి-"ఈ గులాబీ పట్టుకుని, ఆ కిటికీ దగ్గర నిలబడి...'రా ప్రియా! రా! నేను నీ కోసమే చూస్తున్నాను!పెళ్ళి చేసుకుందాం రా!' అను. జరిగేది చూడు! నీకంతా మంచే జరుగుతుంది'' అంది అమ్మ వారు. 'సరే'నని అలాగే పిలిచింది కమల. ఏం జరగలేదు. మళ్ళీ అలాగే-'రా ప్రియా! రా! నేను నీ కోసమే చూస్తున్నాను!పెళ్ళి చేసుకుందాం రా' అంది కమల. అంతలో ఆకాశంలోంచి విసురుగా కిటికీ దగ్గరగా ఓ డేగ వచ్చింది. కాళ్ళతో పెద్ద మూట పట్టుకుని వచ్చింది. పట్టుకు వచ్చిన మూటను కిటికీలోంచి లోపలికి జారవిడిచి
ఎగిరిపోయింది. జరిగిందానికి ఆశ్చర్యపోతూ మూటను విప్పి చూసింది కమల. మూటలో మంచి మంచి పట్టు దుస్తులు ఉన్నాయి. వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటిని ధరించి అద్దంలో తనను తాను చూసుకుంది కమల.ఎప్పుడూ లేనంత అందంగా కనిపించడంతో సిగ్గుపడి చేతుల్లో ముఖాన్ని దాచుకుంది. "ఏంటమ్మా! అంతలా సిగ్గుపడుతున్నావు'' అడిగింది అమ్మవారు."ఇది...ఇదంతా ఏంటమ్మా! ఈ దుస్తులు, నగలు, ఆ డేగా...'' అడిగింది కమల."అదంతే! నువ్వేం కంగారు పడకు! రేపు కూడా నువ్వు గులాబీ పువ్వు పట్టుకుని కిటికీ దగ్గర నిలబడి నేను ఇంతకు ముందు నీకు చెప్పినట్టుగానే అంటూ ఉండు! జరిగేది చూస్తుండు! రేపే కాదు, నేను వద్దనేంత
వరకూ నువ్వు ఆ కిటికీ దగ్గర నిలబడి అలాగే అంటూ ఉండాలి! గుర్తు పెట్టుకో'' అని అమ్మవారు వెళ్ళిపోయింది. అమ్మవారు చెప్పినట్టుగానే మర్నాడు కూడా కమల గులాబీ చేత్తో పట్టుకుని కిటికీ దగ్గర నిలబడి
యధాప్రకారం-"రా ప్రియా! రా! పెళ్ళి చేసుకుందాం రా'' అనసాగింది. అంతలో అటుగా కాంతం కుంటి చెల్లెలు వస్తూ కిటికీ దగ్గర నిలబడి ఎవర్నో పిలుస్తోన్న కమలని, ఆమె ధరించిన పట్టు దుస్తులు, బంగారు నగలూ చూసి
'వింతలో వింత'అన్నట్టుగా ఆశ్చర్యపోయి, ఇంటికి చేరుకుని తను చూసిందంతా కాంతానికి చెప్పింది."అయితే కమలని మీ బావ సుందరయ్య చంపలేదన్న మాట'' అంది కాంతం."తీర్థం పేరు చెప్పి దాన్ని చంపి రమ్మన్నానే! చంప లేదన్న మాట'' భర్త మీద పీకల్దాకా కోపాన్ని తెచ్చుకుంది. "నీ మాటలు నమ్మలేకపోతున్నాను! రేపోసారి నువ్వెళ్ళి చూడే! తిరిగొచ్చి చూసిందంతా నాకు చెప్పు''మూగ చెల్లెలికి చెప్పింది కాంతం. 'సరే'నన్నట్టుగా సైగ చేసింది చెల్లెలు. మర్నాడు మూగ చెల్లెలు కమల
ఉండే భవంతిని చేరుకుని, చాటుగా నిలబడి జరిగేదంతా చూడసాగింది.గులాబీని చేత్తో పట్టుకుని కిటికీ దగ్గరగా నిలబడి, అందంగా తయారైన కమల ఎప్పట్లాగే-"రా ప్రియా రా! పెళ్ళి చేసుకుందాం రా' అనగానే ఆకాశంలోంచి డేగ వచ్చి, కాళ్ళతో తను తెచ్చిన మూటను కిటికీలోంచి భవంతిలోకి విసిరేసింది. మూట విప్పి చూస్తే అందులో అన్నీ బంగారు నాణేలు ఉన్నాయి.
డబ్బే డబ్బు!-ఆ డబ్బును కూడా చాటుగా గమనించిన మూగ చెల్లెలు పరిగెత్తుకుని వెళ్ళి కాంతానికి తను చూసిందంతా సైగలతో చెప్పుకొచ్చింది."పిలిస్తే డేగ వచ్చి అంత డబ్బు తెచ్చి పడేసిందా!? ఆశ్చర్యంగా ఉందే'' అంది కాంతం. "తను చూసింది చెప్పింది! ఆ సంగతి అలా ఉంచి, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు'' అడిగింది కుంటి చెల్లెలు."ఏం చెయ్యాలంటే...'' అంటూ ఆమె చెవిలో ఏం చెయ్యాలో చెప్పింది కాంతం. 'అలాగే' అని ఆనందంగా ఒప్పుకుంది చెల్లెలు. మర్నాడు కొంగులో వీధిలో ఏరిన గాజు పెంకులు మూటగట్టుకుని కమల ఉండే భవంతిని
చేరుకుంది కుంటి చెల్లెలు. అక్క కాంతం చెప్పినట్టుగానే కిటికీ కింద దాగుందామె. అంతలో గులాబీని పట్టుకుని కమల కిటికీ దగ్గరకి వచ్చి ఎప్పట్లాగే-"రా ప్రియా రా! పెళ్ళి చేసుకుందాం రా'' అని పిలవగానే డేగ వచ్చింది. కాళ్ళతో ఏదో మూటను తీసుకొచ్చింది. ఆ మూటను కిటికీలోంచి భవంతిలోకి విసిరి తిరిగి వెళ్ళిపోతుండగా కిటికీ కింద దాగున్న కాంతం కుంటి చెల్లెలు కొంగున కట్టుకుని వచ్చిన గాజు పెంకుల్ని డేగ మీదికి బలంగా విసిరింది. గాజు పెంకులు ఒకొక్కటీ ఒక్కో బాణంలా వచ్చి డేగను గుచ్చుకోవడంతో రక్తసిక్తమై డేగ నేల రాలిపోయింది. డేగ నేల
రాలిపోవడంతో 'బలే పని జరిగింది' అనుకుంటూ కుంటి చెల్లెలు అక్కణ్నుంచి కుంటుకుంటూ పారిపోతే...నేల రాలి ప్రాణాలు పొగొట్టుకున్న డేగను చూస్తూ కమల ఏడవసాగింది."ఎవరు? ఎవరు ఇంత దారుణానికి పూనుకున్నారు'' అని అటూ ఇటూ చూసి ఎవరూ కనిపించకపోవడంతో ఏం చెయ్యాలో తోచక డేగను ఒడిలో పెట్టుకుని మరింతగా ఏడవసాగింది కమల. అమ్మవారు వచ్చిందప్పుడు."ఏమైందమ్మా'' అడిగింది. జరిగిందంతా చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్న డేగను చూపించింది కమల."ఇదీ నీ మంచికే జరిగింది'' అని డేగను చేతిలోనికి తీసుకుని జాలిగా అమ్మవారు నిమిరిందో లేదో...ఆ డేగ అందమయిన రాకుమారుడిగా మారి కమల ముందు నిలిచింది."పెళ్ళి చేసుకుందామా'' కమలని అడిగాడు రాకుమారుడు."ఇన్ని రోజులుగా అడుగుతూనే ఉంది కదా! ఇంకా ఆలస్యమా'' అంది అమ్మవారు. కమలని వెనకేసుకుని వచ్చింది. "ముని శాపంతో డేగవయ్యావు! గాజు పెంకులతో శాప విమోచనమయింది! అడిగిన పిల్లనే పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చావు. ఇప్పుడా మాట తప్పకు'' అంది అమ్మవారు. రాకుమారుణ్ణి హెచ్చరించింది. "ఇచ్చిన మాట తప్పనమ్మా! అందుకేగా ఆది నుంచీ కమలని రాణిగా చూసుకునేందుకు నగలు, దుస్తులు, డబ్బూ ఇచ్చింది'' అన్నాడు రాకుమారుడు. అమ్మవారు పూల దండలు అందిస్తే కమల, రాకుమారుడూ దండలు
మార్చుకున్నారు. అమ్మవారి సమక్షంలో ఆ ఇద్దరికీ పెళ్ళి జరిగి పోయింది. ఈ సంగతి తెలుసుకున్న కమల తండ్రి సుందరయ్య ఎంతగానో ఆనందించాడు.
** *** **

నవ్య వీక్లీలో పాల పిట్ట శీర్షికలో 'అరణి' పేరుతో వచ్చే నా కథలన్నీ ఇక వారం వారం మీ కోసం.

1 comment:

Unknown said...

good information
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our channel.